VIJAYA KERATAM
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 12:52 pm Posted by : VIJAYA KERATAM

.500 కోట్ల విలువైన భూమి దానం చేసిన మహనీయుడు.. ఖాన్ బహదూర్ ఇమాముద్దీన్ సాబ్

అనంతపురం ఆసుపత్రి నిర్మాణానికి 1902లో భూమితో పాటు నగదు విరాళం

అనంతపురం: ప్రజలకు మెరుగైన వైద్యం అందాలన్న సంకల్పంతో దశాబ్దాల క్రితమే తన విలువైన ఆస్తులను ప్రజా ప్రయోజనాలకు దానం చేసిన మహనీయుడు ఖాన్ బహదూర్ ఇమాముద్దీన్ సాబ్. అనంతపురంలోని విక్టోరియా ఆసుపత్రి నిర్మాణం కోసం ఆయన భూమితో పాటు నగదు విరాళం అందించినట్లు చారిత్రక వివరాలను ఉటంకిస్తూ పలువురు పేర్కొంటున్నారు.

దాదాపు 120 ఏళ్ల క్రితం అనంతపురం ప్రాంతానికి అప్పటి గవర్నర్‌ లార్డ్‌ ఆంప్ట్‌హిల్‌, ఆయన సతీమణి లేడీ ఆంప్ట్‌హిల్‌ వచ్చిన సమయంలో ఆసుపత్రి నిర్మాణం కోసం ఇమాముద్దీన్ సాబ్ భూమిని దానం చేసినట్లు సమాచారం. 1902లో ఆసుపత్రి నిర్మాణానికి రూ.2 వేలకుపైగా నగదు కూడా విరాళంగా ఇచ్చినట్లు చెబుతున్నారు.

ఇమాముద్దీన్ సాబ్‌ దాతృత్వం ఆసుపత్రికే పరిమితం కాలేదని, అనంతపురం నగరంలో విద్య, వైద్యం, ప్రజా సౌకర్యాల కోసం భారీగా భూములను దానం చేసినట్లు స్థానిక చరిత్రకు సంబంధించిన కథనాలు పేర్కొంటున్నాయి. నేటి మార్కెట్‌ విలువ ప్రకారం ఆయన దానం చేసిన భూముల విలువ వేల కోట్ల రూపాయలకు చేరుతుందని ఆ కథనాల్లో పేర్కొంటున్నారు.

అయితే ఇంతటి సేవ చేసిన ఇమాముద్దీన్ సాబ్‌ గురించి ప్రస్తుత తరానికి పెద్దగా తెలియకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన సేవలను భావితరాలకు పరిచయం చేసేలా అనంతపురం నగరంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆయన దాతృత్వ చరిత్రను వివరించే సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రజా ప్రయోజనాల కోసం ఆస్తులను దానం చేసిన ఇలాంటి మహనీయుల సేవలను చరిత్రలో పదిలపరచడం సమాజ బాధ్యతగా పలువురు అభిప్రాయపడుతున్నారు.