VIJAYA KERATAM
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 6:54 am Posted by : VIJAYA KERATAM

డిండి ప్రాజెక్టుకు 0.6 టీఎంసీల నీటి కేటాయింపు హర్షణీయం డీకే అరుణ డిండి ప్రాజెక్టు రద్దు వ్యాఖ్యలు సరికావు.. పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదా సాధించాలి: గుత్తా సుఖేందర్ రెడ్డి

డిండి ప్రాజెక్టుకు 0.6 టీఎంసీల నీటి కేటాయింపు హర్షణీయం

డీకే అరుణ డిండి ప్రాజెక్టు రద్దు వ్యాఖ్యలు సరికావు.. పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదా సాధించాలి: గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్గొండ, అక్టోబర్ 25 (విజయ కెరటం): డిండి ఎత్తిపోతల పథకానికి 0.6 టీఎంసీల నీటిని కేటాయించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షణీయమని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా జలాల వినియోగం, డిండి, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులపై మాట్లాడారు.

డిండి ప్రాజెక్టును రద్దు చేయాలంటూ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ చేసిన వ్యాఖ్యలు సరికావని గుత్తా పేర్కొన్నారు. ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించకుండా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా సాధించేందుకు ఆమె కృషి చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు సమకూరేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. డిండి ప్రాజెక్టుకు నీటి కేటాయింపు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

దేవరకొండ, మునుగోడు ప్రాంతాల ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు సురక్షితమైన తాగునీరు అందించడంలో డిండి ప్రాజెక్టు కీలకమని ఆయన వివరించారు. నీటి వనరులను ప్రాంతాలవారీగా విభజించి వివాదాలు సృష్టించడం సరైన విధానం కాదన్నారు. ఏఎంఆర్పీ ద్వారా హైదరాబాద్‌కు 30 టీఎంసీల నీటిని అందిస్తున్న విషయాన్ని గుర్తుచేస్తూ, నీటి వినియోగంలో ప్రాంతీయ ప్రయోజనాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతిపాదిత సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సుమారు 10 లక్షల ఎకరాలకు నీరందించాలనే లక్ష్యం ఉండగా, ప్రస్తుతం 7.78 లక్షల ఎకరాలకు సంబంధించిన సాగునీటి సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ఎస్ఎల్‌బీసీ, ఉదయసముద్రం, డిండి, దేవాదుల ప్రాజెక్టుల ద్వారా 7.58 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, పనులు పూర్తిస్థాయిలో పూర్తి కాలేదన్నారు.

కృష్ణా బేసిన్‌లోని పెండింగ్ ప్రాజెక్టులకు గత ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఖర్చు చేసిన నిధుల్లో సగం కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు కేటాయించి ఉంటే అనేక పనులు పూర్తయ్యేవని అభిప్రాయపడ్డారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయంగా లిఫ్ట్ ద్వారా నీటిని అందించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ప్రతిపాదనలు ఉండగా, 8.50 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే రైతులకు ప్రయోజనం కలగడంతో పాటు దశాబ్దాలుగా కొనసాగుతున్న వలసలను నివారించేందుకు దోహదపడుతుందన్నారు.

నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల రైతాంగ ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని గుత్తా స్పష్టం చేశారు. రెండు ప్రాంతాల ప్రజలు నీటి కోసం పరస్పరం వివాదాలకు దిగడం వల్ల ఇరు జిల్లాలకూ నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య జలవివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.

ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పుల నేపథ్యంలో నీటి లభ్యతపై నెలకొన్న పరిస్థితులను ముఖ్యమంత్రి ప్రజలకు వివరించారని తెలిపారు. రాష్ట్రంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను, ముఖ్యంగా కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం కృషి చేస్తున్న వామపక్ష పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులను అభినందించారు. రాజకీయాలకు, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల రైతాంగ ప్రయోజనాల కోసం అందరూ సమష్టిగా కృషి చేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.