విజయ కెరటం ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని ఏకలవ్య హైస్కూల్‌లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. శనివారం ప్రారంభం కానున్న ఎంగిలిపూల బతుకమ్మను పురస్కరించుకుని శుక్రవారం పాఠశాలలో విద్యార్థినులు ఆటపాటలు, నృత్యాలతో సందడి చేశారు. పరీక్షల హడావిడి ముగియడంతో బతుకమ్మ పండుగ విద్యార్థినుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.
వివిధ రకాల సంప్రదాయ వస్త్రధారణలతో ముస్తాబైన విద్యార్థినులు బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. విద్యార్థినుల తల్లిదండ్రులు ఈ వేడుకలను ఆసక్తిగా తిలకిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయినులు సైతం విద్యార్థినులతో కలిసి బతుకమ్మ పాటలకు నృత్యాలు చేయడంతో చిన్నారుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. దీంతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడింది.
ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ఆడపడుచులు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ అని తెలిపారు. ఏడాది పొడవునా ఎదురయ్యే ఇబ్బందులు, బాధలను మరచిపోయి అందరూ కలిసి ఆటపాటలతో పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని, నూతనోత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.