VIJAYA KERATAM
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 1:44 pm Posted by : VIJAYA KERATAM

జర్నలిస్టుల నిర్బంధంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంఘం ఢిల్లీలో పోలీసుల చర్యలను సవాల్ చేస్తూ NWMI పిటిషన్‌.. జర్నలిస్టుల హక్కులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి

జర్నలిస్టుల నిర్బంధంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంఘం

 

  1. ఢిల్లీలో పోలీసుల చర్యలను సవాల్ చేస్తూ NWMI పిటిషన్‌.. జర్నలిస్టుల హక్కులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి

న్యూఢిల్లీ (విజయ కెరటం): ఢిల్లీలో నిరసన కార్యక్రమాలను కవర్ చేస్తున్న జర్నలిస్టులను పోలీసులు నిర్బంధించడం, బలవంతంగా అదుపులోకి తీసుకోవడం, అక్కడి నుంచి తరలించడం వంటి చర్యలు రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తున్నాయని ఆరోపిస్తూ నెట్‌వర్క్ ఆఫ్ విమెన్ ఇన్ మీడియా, ఇండియా (NWMI) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద పిటిషన్ దాఖలు చేసింది.

 

జర్నలిస్టులపై పోలీసుల చర్యలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19(1)(a), 19(1)(d), 21లకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొంది. స్వతంత్రంగా వార్తలు సేకరించే జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, నిరసన కార్యక్రమాల సమయంలో వారి హక్కులను పరిరక్షించేందుకు న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని కోరింది.

 

సీనియర్ జర్నలిస్టు పరంజోయ్ గుహా ఠాకుర్తా అక్టోబర్ 10న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) గుర్తింపు కార్డు చూపించినప్పటికీ పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని పిటిషన్‌లో ప్రస్తావించారు. తనను నిర్బంధించడానికి గల కారణాలు తెలియజేయలేదని, సంబంధిత పత్రాలు కూడా అందించలేదని ఆయన పేర్కొన్నట్లు వివరించారు.

 

అలాగే, ఢిల్లీలో రెండు రోజుల వ్యవధిలో కనీసం 35 మంది జర్నలిస్టులను నిర్బంధించినట్లు కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (CPJ) నివేదికలో పేర్కొన్న అంశాన్ని కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు.

 

నిరసన కార్యక్రమాల సమయంలో జర్నలిస్టులు స్వేచ్ఛగా వార్తలు సేకరించే హక్కును కాపాడాలని, పోలీసుల చర్యలపై న్యాయపరమైన జోక్యం చేసుకుని తగిన రక్షణ కల్పించాలని NWMI సుప్రీంకోర్టును కోరింది.