- నల్గొండలో పోలీసుల మెరుపు తనిఖీలు.. 59 మంది అదుపులోకి, 15 మందికి డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్
నల్గొండ, అక్టోబర్ 19 (విజయ కెరటం): పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు వన్‌టౌన్, టూటౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, ట్రబుల్ మంగర్స్, గంజాయి, మత్తు టాబ్లెట్ల వినియోగదారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
ఈ తనిఖీల్లో మొత్తం 59 మందిని అదుపులోకి తీసుకొని డీటీసీలో విచారించారు. డ్రగ్ టెస్టింగ్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా, వారిలో 15 మంది గంజాయి లేదా మత్తు టాబ్లెట్లు వినియోగించినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. మత్తు పదార్థాలను ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు? ఎవరు సరఫరా చేస్తున్నారు? ఇంకా ఎవరెవరు వినియోగిస్తున్నారు? అనే అంశాలపై ప్రత్యేక పోలీసు బృందాలు విచారణ చేపట్టాయి. బాధితులకు కౌన్సెలింగ్ అందించడంతో పాటు అవసరమైన వారిని పునరావాస కేంద్రాలకు పంపించే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులు, బ్లాక్‌మెయిలర్లు, మత్తు పదార్థాల వినియోగదారులపై నిరంతర నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. సెటిల్‌మెంట్లు, బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని, ప్రజల నుంచి ఫిర్యాదులు అందితే వెంటనే స్పందించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ తనిఖీల్లో నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, వన్‌టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్‌ఐలు ముత్తయ్య, సైదులు, టూటౌన్ ఎస్‌ఐ సైదాబాబు, రూరల్ ఎస్‌ఐ శివప్రసాద్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి: మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగం, బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే 112 లేదా గంజాయి, మత్తు పదార్థాల నిరోధక టోల్‌ఫ్రీ నంబర్ 8712670266కు తెలియజేయాలని జిల్లా పోలీస్ శాఖ కోరింది.