VIJAYA KERATAM
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 1:53 pm Posted by : VIJAYA KERATAM

గ్రామస్థాయి నుంచి ఆదివాసీ కమిటీల బలోపేతం కాంగ్రెస్ పార్టీకి ఆదివాసీలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు: ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

గ్రామస్థాయి నుంచి ఆదివాసీ కమిటీల బలోపేతం

 

  • కాంగ్రెస్ పార్టీకి ఆదివాసీలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు: ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక

 

నల్లగొండ, అక్టోబర్ 18 (విజయ కెరటం): కాంగ్రెస్ పార్టీకి ఆదివాసీలు ఎల్లవేళలా వెన్నుదన్నుగా ఉంటారని ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆదివాసీ చైర్మన్ కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. ఆదివాసీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

 

ఆదివారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సంఘటన్ సృజన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రస్థాయి ఆదివాసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శంకర్ నాయక్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఆదివాసీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులకు బాధ్యతలు అప్పగించి 33 జిల్లాల్లో కమిటీల ఎంపిక చేపడతామని వెల్లడించారు. ఈ కమిటీల ద్వారా పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

 

రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామ రామ్మోహన్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డిల విజయానికి కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 75 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్ల టీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పిస్తూ, బీజేపీ మతాల పేరుతో రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.

 

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ వ్యయం మొదట రూ.26 వేల కోట్లుగా ఉండగా, ప్రస్తుతం రూ.36 వేల కోట్లకు చేరిందని శంకర్ నాయక్ తెలిపారు. అయినప్పటికీ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

 

ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆదివాసీ సమావేశం జరగనుందని, ఈ సమావేశంలో సీఎం భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారని వెల్లడించారు.

 

ఈ సమావేశంలో ఆదివాసీ వైస్ చైర్మన్లు లింగం నాయక్, హనుమంతు నాయక్‌తో పాటు మోహన్, గణేష్, శ్రీనివాస్, చంద్రకళ, మల్లికార్జున్, మల్లీశ్వరి నాయక్, కోట్య నాయక్, తిరుమల నాయక్ తదితరులు పాల్గొన్నారు.