రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో తిప్పర్తి విద్యార్థిని వర్షిని సత్తా!
ఫైనల్స్‌లో రంగారెడ్డి జట్టుపై 37–25 తేడాతో ఘన విజయం
తిప్పర్తి (విజయ కెరటం): తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మహిళల అండర్–20 కబడ్డీ పోటీల్లో తిప్పర్తికి చెందిన విద్యార్థిని జేరిపోతుల వర్షిని ప్రతిభ చాటుకుంది. సోమవారం జరిగిన ఫైనల్స్‌లో రంగారెడ్డి జిల్లా జట్టుతో తలపడి 37–25 పాయింట్ల తేడాతో విజయం సాధించి తన జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించింది.
తిప్పర్తి ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వర్షినికి చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి ఉంది. చదువుతోపాటు కబడ్డీ సాధనకు సమయం కేటాయిస్తూ క్రీడల్లో రాణిస్తోంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి పోటీల వరకు ఎదిగి, ఫైనల్స్‌లో విజయం సాధించడం విశేషం.
చదువులో రాణిస్తూనే క్రీడల్లోనూ విజయాలు సాధిస్తున్న వర్షినిని గ్రామస్తులు, మండల ప్రజలు, క్రీడాభిమానులు అభినందిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు.