నల్లగొండ, సెప్టెంబర్ 26 (విజయ కెరటం): నల్లగొండ జిల్లాలో గణేష్ నిమజ్జనం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగిసింది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, గణేష్ ఉత్సవ కమిటీలు, అధికారులు, పోలీసు సిబ్బంది సమన్వయంతో నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.
నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన జిల్లా ప్రజలు, ఉత్సవ కమిటీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ముందస్తు ప్రణాళికలు, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, శాఖల మధ్య సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గణపతి నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని పేర్కొన్నారు.
శనివారం కలెక్టర్‌ను కలిసిన పలువురు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను కలెక్టర్, ఎస్పీ అభినందించి శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, డీఆర్‌ఓ దశరథ తదితరులు పాల్గొన్నారు.



