నల్లగొండ, సెప్టెంబర్ 28 (విజయ కెరటం ప్రతినిధి – మహమ్మద్ ఎజాజ్): నల్లగొండలోని హజరత్ సయ్యద్ షా లతీఫుల్లా ఖాద్రి దర్గా ఉర్సు ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అక్టోబర్ 1 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఉర్సుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచనలు, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ సహకారంతో దర్గా పరిసరాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, భద్రత, రాకపోకలు తదితర సౌకర్యాలను కల్పించారు. భక్తుల భద్రత కోసం పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు దర్గా మెట్ల పనులను కూడా పూర్తి చేశారు.
కార్పొరేటర్ సయ్యద్ సమద్ ఆధ్వర్యంలో ఉర్సు కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక సందడి
అక్టోబర్ 1న మదీనా మసీదు నుంచి గంధం ఊరేగింపు ప్రారంభమై గడియారం సెంటర్, ఆర్‌పీ రోడ్, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్, ఓల్డ్ సిటీ చౌరస్తా, గంజ్ మీదుగా దర్గా మెట్ల వద్దకు చేరుకోనుంది. అనంతరం హజరత్ లతీఫ్ షా వలీకి గంధం సమర్పిస్తారు.
అక్టోబర్ 2న అన్నదాన కార్యక్రమం, మెఫిల్-ఎ-నాత్ షరీఫ్, ప్రత్యేక దీపాలంకరణ నిర్వహించనున్నారు. అక్టోబర్ 3న ప్రముఖ గాయకులతో ఖవ్వాలి కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఉర్సు ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు దర్గా ముతవల్లీలు, ఉర్సు కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు, నాయకులు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దర్గా ఇనందర్ ముతవల్లీలు సయ్యద్ సమీ ఉల్లా ఖాద్రి, సయ్యద్ గౌస్ ఖాద్రి, సయ్యద్ సల్మాన్ ఖాద్రి, ఉర్సు కమిటీ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ హాశం, మసియుద్దిన్ అడ్వకేట్, సెక్రటరీ, కార్పొరేటర్ సయ్యద్ సమద్, నవీద్, ఫిరోజ్, పాషా, ఇల్యాస్, వెంకన్న తదితరులు ఏర్పాట్లలో పాల్గొంటున్నారు.



