వాషింగ్టన్, సెప్టెంబర్ 25: వాణిజ్యం, సాంకేతికత, తైవాన్, ఇరాన్ తదితర అంశాలపై అమెరికా–చైనా మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటనకు చేరుకున్నారు. మేరీల్యాండ్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు చేరుకున్న జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఘన స్వాగతం పలికారు.
వంద అడుగుల రెడ్‌కార్పెట్, సైనిక గౌరవ వందనం, రక్షణ విమానాల ఫ్లైఓవర్‌తో స్వాగత కార్యక్రమం నిర్వహించారు. ట్రంప్, జిన్‌పింగ్ పరస్పరం కరచాలనం చేసుకుని కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం జిన్‌పింగ్ గౌరవార్థం ట్రంప్ దంపతులు శ్వేతసౌధంలో విందు ఇవ్వనున్నారు.
వాణిజ్య ఒప్పందం గడువు పొడిగింపు
అమెరికా–చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఒప్పందాన్ని వచ్చే ఏడాది జనవరి 10 వరకు పొడిగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. విస్తృత వాణిజ్య ఒప్పందంపై చర్చలకు ఈ నిర్ణయం మరింత సమయం కల్పించనుంది.
ట్రంప్–జిన్‌పింగ్ భేటీలో సుంకాల తగ్గింపు, ఏఐ సాంకేతికత, తైవాన్, ఇరాన్, అంతర్జాతీయ భద్రత, అరుదైన ఖనిజాలు, కంప్యూటర్ చిప్‌ల ఎగుమతులు వంటి కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
‘భాగస్వాములుగా ఉండాలి’
అమెరికా–చైనా దేశాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని జిన్‌పింగ్ పేర్కొన్నారు. అయితే సుంకాలు, తైవాన్‌కు అమెరికా మద్దతు, ఎగుమతి నియంత్రణలు, ఇరాన్‌తో చైనా సంబంధాలు వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.
భేటీ అనంతరం సంయుక్త మీడియా సమావేశం నిర్వహించకుండా ఇరు దేశాలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.



