హైదరాబాద్ పోచారం సంస్కృతి టౌన్‌షిప్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సంతోషి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇంట్లో చున్నీతో ఉరేసుకున్న స్థితిలో ఆమె కనిపించినట్లు సమాచారం. సంతోషి గెలాక్సీ టవర్స్‌లోని యాక్సిస్ బ్యాంక్‌లో పనిచేస్తుండగా, ఆమె స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం.
విశాఖపట్నానికి చెందిన రమాకాంత్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంతోషికి రెండున్నరేళ్ల కవల పిల్లలు ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో భర్త ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. పని మనిషి ఇంటికి వచ్చి చూడగా సంతోషి విగతజీవిగా కనిపించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
సంతోషి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్త రమాకాంత్ వేధింపుల కారణంగానే ఆమె మృతి చెందిందని ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.


