హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ చరిత్ర, సంస్కృతి, శిల్పకళ ప్రతిబింబించేలా నూతన నిర్మాణాల డిజైన్లు రూపొందించాలని నిర్ణయించారు. కాకతీయ కళాతోరణం, రామప్ప దేవాలయం, పిల్లలమర్రి ఆలయాల శిల్ప, వాస్తు శైలులను పరిశీలించి, వాటి స్ఫూర్తితో విమానాశ్రయాలు, తెలంగాణ భవన్ డిజైన్లు రూపొందించే అంశంపై చర్చించారు.
విమానాశ్రయాల పనులను వేగవంతం చేసేందుకు విద్యుత్ లైన్లు, రహదారులు, బీఎస్ఎన్ఎల్ లైన్లు, తాగునీటి సరఫరా, వాగుల ప్రవాహాల మళ్లింపు పనుల్లో వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. ఎయిర్‌పోర్టు కాంపౌండ్ వాల్ సమీపంలో నిర్మించే రహదారులను జిల్లా, రాష్ట్ర, జాతీయ రహదారులతో అనుసంధానించాలని నిర్ణయించారు.
ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికతో నిర్దేశిత గడువులో నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు


