తెలంగాణలో రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలు, దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గాను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డుకు ఎంపికయ్యారు.
కేరళకు చెందిన దివంగత నేత, మాజీ మంత్రి ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ (AMF) ఈ పురస్కారాన్ని అందిస్తోంది. ప్రజాస్వామిక విలువల పట్ల సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్న నిబద్ధతను అవార్డు జ్యూరీ ప్రత్యేకంగా ప్రశంసించింది.
ఫౌండేషన్ వర్కింగ్ చైర్మన్, నిలంబూర్ ఎమ్మెల్యే ఆర్యదాన్ షౌకత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎంపీ బెన్నీ బెహనన్, కేరళ రెవెన్యూ శాఖ మంత్రి ఏపీ అనిల్‌కుమార్, ప్రముఖ మేధావి కల్పెట్ట నారాయణన్ జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు.
ఆర్యదాన్ ముహమ్మద్ నాలుగో వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 25న కేరళలోని నిలంబూర్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డికి అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆర్యదాన్ ముహమ్మద్ స్మారక ఉపన్యాసం చేయనున్నారు.


