తెలంగాణకు కీలక రహదారి ప్రాజెక్టులు.. గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ
ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం.. రాష్ట్రంలో ఐదు రోప్‌వేలకు గ్రీన్‌సిగ్నల్
నల్గొండ / హైదరాబాద్ (విజయ కెరటం):
తెలంగాణలో రహదారి కనెక్టివిటీని మెరుగుపరిచే లక్ష్యంతో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టాల్సిన జాతీయ రహదారులు, వంతెనలు, ఎలివేటెడ్ కారిడార్లు, రోప్‌వేలు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు. పలు ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడంతో పాటు సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
భేటీలోని ముఖ్యాంశాలు ఇవీ..
ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌కు ఆమోదం లభించింది. కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ వంతెనతో తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య రవాణా అనుసంధానం మెరుగుపడటంతో పాటు పర్యాటక రంగానికి ప్రయోజనం చేకూరనుంది.
హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారి (NH-765)పై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనకు సంబంధించి కొత్త డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్–విజయవాడ–మచిలీపట్నం (NH-65) రహదారి విస్తరణ పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. పర్వతమాల పథకం కింద తెలంగాణలో ఐదు రోప్‌వేల ఏర్పాటుకు ఆమోదం లభించగా, హైదరాబాద్–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రతిపాదనపైనా సానుకూల స్పందన వచ్చింది.
సేతు బంధన్ పథకం కింద మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జిల (ROBలు) నిర్మాణానికి ఆమోదం లభించింది. రాష్ట్రంలో చేపట్టాల్సిన 34 పనులకు CRIF నిధులు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి కోరగా, ఈ అంశంపై సంబంధిత అధికారులకు కేంద్ర మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
అలాగే పుల్లూరు–అలంపూర్–జట్రపోలు–పెంట్లవెల్లి–కొల్లాపూర్–లింగాల–అచ్చంపేట–డిండి–దేవరకొండ–మల్లేపల్లి–నల్గొండ మార్గంలోని రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలన్న ప్రతిపాదనపైనా సానుకూల స్పందన లభించింది.
ఐఆర్సీ సదస్సుకు గడ్కరీకి ఆహ్వానం
హైదరాబాద్‌లో నవంబర్ 19 నుంచి 22 వరకు జరగనున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (IRC) సదస్సుకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఆహ్వానించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి సదస్సుకు హాజరవుతానని తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ భేటీలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణలో రహదారి సౌకర్యాల విస్తరణ, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, అంతర్రాష్ట్ర రవాణాను మెరుగుపరచడం, పర్యాటక అభివృద్ధికి ఊతమివ్వడం వంటి లక్ష్యాలతో చేపడుతున్న ప్రాజెక్టులకు ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.




