సెప్టెంబర్ 11న దేశవ్యాప్త సమ్మె – 28 నుంచి 30 వరకు మూడు రోజుల ఆందోళన
న్యూఢిల్లీ: పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్బియు) సమ్మెలకు పిలుపునిచ్చింది. ఐదు రోజుల పని వారాన్ని అమలు చేయడం, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పనితీరు ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని ఉపసంహరించుకోవడం వంటి కీలక డిమాండ్లపై బ్యాంక్ యూనియన్లు గట్టిగా నిలబడ్డాయి.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 11న ఒక రోజు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు యుఎఫ్బియు ప్రకటించింది. ఆ తరువాత సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజులపాటు సమ్మె కొనసాగిస్తామని తెలిపింది. డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించింది.
యుఎఫ్బియు కూటమిలో ఎఐబిఇఎ, ఎఐబిఓసి, ఎన్సిబిఇ, ఎఐబిఓఎ, బిఇఎఫ్ఐ, ఐఎన్బిఓసి, ఐఎన్బిఇఎఫ్ వంటి ఏడు ప్రధాన యూనియన్లు ఉన్నాయి. బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న సిబ్బందిలో 90 శాతం మంది ఈ యూనియన్లకు చెందినవారే. ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ, ప్రాంతీయ గ్రామీణ, సహకార బ్యాంకుల ఉద్యోగులు ఈ కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు.
యూనియన్లు ప్రధానంగా నాలుగు డిమాండ్లు ముందుకు తెచ్చాయి. వాటిలో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయడం, పీఎల్ఐ పథకాన్ని ఉపసంహరించడం, ద్వైపాక్షిక చర్చల ద్వారా ప్రోత్సాహక పథకంలో మార్పులు చేయడం, అలాగే పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం ఉన్నాయి.
ఇప్పటికే 2015లో బ్యాంకులు ఐదు రోజుల పని వారానికి సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఆ సమయంలో రెండో మరియు నాల్గవ శనివారాలను సెలవులుగా ప్రకటించారు. 2020లో ఈ అంశాన్ని మళ్లీ సమీక్షించి, 2024 మార్చి 8న వేతన ఒప్పందంలో భాగంగా ఖరారు చేసినట్లు యూనియన్లు పేర్కొన్నాయి.
ఈ ఒప్పందం ప్రకారం అన్ని శనివారాలు సెలవులుగా ప్రకటించాలంటే, సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజూ అదనంగా 40 నిమిషాలు పనిచేయడానికి ఉద్యోగులు అంగీకరించారు. ఈ ప్రతిపాదనను రెండు సంవత్సరాల క్రితమే ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపాలని సిఫార్సు చేసినప్పటికీ, ఇప్పటివరకు ప్రభుత్వ ఆమోదం లభించలేదని యూనియన్లు పేర్కొన్నాయి.
ఇదిలా ఉండగా, భారత రిజర్వ్ బ్యాంక్, ఎల్ఐసి, జిఐసి, నాబార్డ్ వంటి సంస్థలు ఇప్పటికే వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేస్తున్నాయని యూనియన్లు గుర్తు చేశాయి. ఐదు రోజుల విధానం అమలులోకి వచ్చినా కస్టమర్లకు సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదని వారు స్పష్టం చేశారు.


