నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 11, విజయ కెరటం:
బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్లను అందించేందుకు చర్యలు చేపట్టింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కుట్టు వృత్తిని అభివృద్ధి చేసుకోవడంతో పాటు మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో నల్లగొండ పట్టణ పరిధిలోని అర్హత కలిగిన బీసీ మహిళలు సెప్టెంబర్ 15, 2026లోగా TSOBMMS పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
అర్హతలు:
బీసీ వర్గానికి చెందిన నిరుద్యోగ మహిళ అయి ఉండాలి.
ఫుడ్ సెక్యూరిటీ కార్డు కలిగి ఉండాలి.
కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదు.
వయస్సు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం
అర్హత కలిగిన మహిళలు ముందుగా TSOBMMS పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తయిన అనంతరం దరఖాస్తు ప్రతిని అవసరమైన పత్రాలతో కలిసి నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలి.
అర్హత కలిగిన బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నిర్ణీత గడువు సెప్టెంబర్ 15లోగా ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తి చేసి, అనంతరం దరఖాస్తు ప్రతిని మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని అధికారులు కోరారు.


