ఖమ్మం జిల్లాలోని చర్ల మండలం సత్యనారాయణపురం ఎస్టీ బాయ్స్ హాస్టల్లో రూ.14 వేల లంచం తీసుకుంటూ వార్డెన్ భూక్యా వాల్ సింహ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
హాస్టల్లో కుక్‌గా పనిచేస్తున్న వ్యక్తికి జీతం చెల్లించే విషయంలో వార్డెన్ లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. లంచం ఇవ్వడం ఇష్టంలేని కుక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో అధికారులు రంగంలోకి దిగారు.
ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు దాడి నిర్వహించి లంచం తీసుకుంటున్న వార్డెన్‌ను పట్టుకున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి కూడా అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిపై ఏసీబీ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.


