27.2 C
Hyderabad
Thursday, October 1, 2026
Homeతెలంగాణజగిత్యాలలో వైభవంగా తొలి రోజు గణేష్ నిమజ్జనం
Advertisement spot_img

జగిత్యాలలో వైభవంగా తొలి రోజు గణేష్ నిమజ్జనం

Must read

గణపతుల శోభాయాత్రకు పోటెత్తిన భక్తులు.. పటిష్ట బందోబస్తు మధ్య ప్రశాంతంగా నిమజ్జనం

జగిత్యాల జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 23 (విజయ కెరటం): తొమ్మిది రోజులుగా భక్తుల పూజలందుకున్న గణనాథులు బుధవారం గంగమ్మ ఒడికి చేరారు. ‘వచ్చే ఏడాది త్వరగా రా’ అంటూ భక్తులు వీడ్కోలు పలికారు. గణనామస్మరణతో జగిత్యాల పట్టణం మార్మోగింది.

ఉదయం నుంచే గణేష్ మండపాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి మోదకాలు, ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం పూలమాలలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన రథాలపై గణనాథులను ఉంచి శోభాయాత్ర నిర్వహించారు. డోలు, డప్పులు, మంగళ వాయిద్యాల నడుమ ‘గణపతి బప్పా మోరయా.. పుడ్చా వర్షీ లౌకర్ యా’ నినాదాలతో పురవీధులు హోరెత్తాయి. యువత ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ శోభాయాత్రలో పాల్గొనగా, ప్రజలు రోడ్ల వెంబడి బారులు తీరి వీక్షించారు. టవర్ సర్కిల్ మీదుగా చింతకుంట చెరువు వరకు శోభాయాత్ర సాగింది.

పలు మండపాల్లో లడ్డూ వేలం పాటలు నిర్వహించగా, జగిత్యాల వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోని గణపతి లడ్డూను వంగపెల్లి వేణుమాధవ్ రావు–రజని దంపతులు రూ.1.88 లక్షలకు దక్కించుకున్నారు.

పటిష్ట బందోబస్తు మధ్య నిమజ్జనం

వేలాది మంది భక్తులు, వందలాది విగ్రహాల నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. చింతకుంట చెరువు వద్ద క్రేన్లు, లైటింగ్, బారికేడ్లు ఏర్పాటు చేశారు. మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, పోలీసు శాఖలు సమన్వయంతో విధులు నిర్వహించాయి.

జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఆర్డీఓ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్ నిమజ్జన ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ పురుషోత్తం రెడ్డి నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 700 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. శోభాయాత్ర మార్గాలు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు 17 మంది ట్రాన్స్‌జెండర్లను నియమించడం ప్రత్యేకంగా నిలిచింది.

మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ చైర్మన్లు, కౌన్సిలర్లు, విశ్వహిందూ పరిషత్ నాయకులు తదితరులు పాల్గొని గణపతులకు వీడ్కోలు పలికారు. జగిత్యాలలో రెండు రోజుల పాటు నిమజ్జనం జరగనుండగా, తొలి రోజు కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.