నల్లగొండ, సెప్టెంబర్ 25 (విజయ కెరటం): నల్లగొండ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో ఉన్న ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌పై జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ రూ.5 లక్షల జరిమానా విధించింది. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) చట్టం–2010 నిబంధనల అమలులో భాగంగా ఆగస్టు 11న జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి ఆధ్వర్యంలో ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రికి సంబంధించి మొత్తం 10 లిఖితపూర్వక ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.
తనిఖీలో పలు నిబంధనల ఉల్లంఘనలు, లోపాలు గుర్తించడంతో ఆసుపత్రి యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. యాజమాన్యం సమర్పించిన వివరణ, తనిఖీ నివేదిక, వైద్య రికార్డులు, ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకున్నారు.
ఆసుపత్రిలో నమోదైన 191 మరణాలకు సంబంధించిన రికార్డులు, ఆరోగ్యశ్రీ సేవల నిర్వహణ, రోగుల పూర్తి వివరాలు, భవన అనుమతులు, వైద్య సిబ్బంది–పరికరాల వివరాలు, పార్కింగ్ సౌకర్యం, అధిక ఛార్జీల ఫిర్యాదులకు సంబంధించిన ఆర్థిక రికార్డులు, ల్యాబ్, అల్ట్రాసౌండ్ సేవలు తదితర అంశాల్లో లోపాలను అధికారులు గుర్తించారు. పార్కింగ్ కోసం కేటాయించిన సెల్లార్‌లో ఇతర వైద్య విభాగాలు నిర్వహిస్తున్న అంశాన్ని కూడా పరిశీలించారు.
ఈ ఉల్లంఘనలకు సంబంధించి క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టంలోని సెక్షన్ 42 కింద రూ.5 లక్షల జరిమానా విధిస్తూ జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. జరిమానాను 30 రోజుల్లోపు చెల్లించాలని, గుర్తించిన లోపాలు, ఉల్లంఘనలను రెండు నెలల్లోపు సరిదిద్దుకోవాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించింది. అనంతరం పునఃపరిశీలన, తనిఖీ నిర్వహించి నిబంధనల అమలును ధృవీకరించనున్నట్లు అధికారులు తెలిపారు.


