జూనియర్ బాలికల కబడ్డీ పోటీలకు ఎంపిక.. అశ్వారావుపేటలో జిల్లా తరఫున ప్రాతినిధ్యం
తిప్పర్తి, అక్టోబర్ 10 (విజయ కెరటం ప్రతినిధి):
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభకు ప్రోత్సాహం లభిస్తే రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటవచ్చని తిప్పర్తి విద్యార్థిని జెర్రిపోతుల వర్షిణి నిరూపించింది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుతున్న వర్షిణి తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల కబడ్డీ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 10 నుంచి 13 వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో జరిగే పోటీల్లో ఆమె నల్గొండ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.
జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ
ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో వర్షిణి తన రైడింగ్, డిఫెన్స్ నైపుణ్యాలతో పాటు శారీరక దారుఢ్యాన్ని ప్రదర్శించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన క్రీడాకారిణులు పాల్గొనే ఈ పోటీల్లో వర్షిణి తన ప్రతిభను చాటేందుకు సిద్ధమైంది. పాఠశాల స్థాయి నుంచే కబడ్డీపై ఆసక్తితో నిరంతరం సాధన చేయడం ఆమె విజయానికి కారణమని వ్యాయామ ఉపాధ్యాయుడు నిమ్మల లెనిన్ బాబు తెలిపారు.
వర్షిణిని అభినందించిన ప్రధానోపాధ్యాయులు
వర్షిణి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. నరసింహ నాయక్ హర్షం వ్యక్తం చేశారు. వర్షిణిని పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించడం అభినందనీయమన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో వర్షిణి ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందడుగు
వర్షిణి విజయంపై సీనియర్ ఉపాధ్యాయులు దామోదర్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, తోటి విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు. ఆమె విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
వర్షిణి తండ్రి, సీనియర్ జర్నలిస్టు జెర్రిపోతుల సైదులు గౌడ్ తనకు ఎంతో ప్రోత్సాహం అందించారని వర్షిణి తెలిపింది. ఆడపిల్లలను కూడా అబ్బాయిలతో సమానంగా ప్రోత్సహిస్తూ తనను ఈ స్థాయికి తీసుకురావడంలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించారని పేర్కొంది. తనపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను నెరవేర్చి, వారికి మంచి పేరు తీసుకురావడమే తన లక్ష్యమని వర్షిణి తెలిపింది.




