నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలపై ప్రశ్నలు
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు, ఐసీయూ, వెంటిలేటర్ సదుపాయాల కొరతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రహమత్‌నగర్‌కు చెందిన 24 ఏళ్ల మహమ్మద్ ఆదిల్ అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా బెడ్ అందుబాటులో లేదని వైద్యం అందించకుండా వెనక్కి పంపించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
దీంతో చేసేదేమీ లేక కుటుంబ సభ్యులు అప్పు చేసి ఆదిల్‌ను నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి రెండు రోజుల పాటు చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదిల్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర చికిత్సకు అవసరమైన ఐసీయూ, వెంటిలేటర్ బెడ్ల సంఖ్య పరిమితంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ ఆసుపత్రే ప్రధాన ఆధారం కావడంతో వైద్య సదుపాయాలను మరింత పెంచాలని వారు కోరుతున్నారు.
ఆదిల్‌కు ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ ఎందుకు లభించలేదు? అత్యవసర చికిత్స అందించే అవకాశం ఉన్నప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రికి ఎందుకు తరలించాల్సి వచ్చింది? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.
జిల్లా కలెక్టర్, వైద్యశాఖ ఉన్నతాధికారులు ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరిపి, ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూ, వెంటిలేటర్ బెడ్ల సంఖ్యను పెంచడంతో పాటు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


