29.2 C
Hyderabad
Thursday, October 1, 2026
Homeతెలంగాణగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు
Advertisement spot_img

గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు

Must read

నల్లగొండ: గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ డైవర్షన్లు, ప్రత్యేక నిమజ్జన మార్గాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 6,184 గణేష్ విగ్రహాలు ఏర్పాటు కాగా, నిమజ్జన బందోబస్తు కోసం సుమారు 1,000 మంది పోలీస్ సిబ్బందిని విధుల్లో ఉంచుతున్నట్లు వెల్లడించారు.

విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక నిమజ్జన మార్గాలను నిర్ణయించారు. 10 అడుగుల లోపు విగ్రహాలను బతుకమ్మకుంట/వల్లభరావు చెరువులో, 10 అడుగులకు పైగా ఉన్న విగ్రహాలను క్లాక్ టవర్–రామగిరి–పానగల్ ఫ్లైఓవర్–తిప్పర్తి–వేములపల్లి మార్గంలో సాగర్ కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రదేశానికి తరలించాలని సూచించారు. సెయింట్ ఆల్ఫోన్సస్ స్కూల్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉన్నందున 10 అడుగులకు పైగా ఉన్న విగ్రహాలను 14వ మైలు, హాలియా వైపు అనుమతించబోమని తెలిపారు.

శోభాయాత్ర జరిగే ప్రధాన మార్గాలు, కాలనీల్లో సీసీ కెమెరాల ద్వారా జిల్లా పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ నుంచి నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నారు. ఇప్పటికే గణేష్ విగ్రహాలు, మండపాలకు జియో ట్యాగింగ్ పూర్తి చేసినట్లు పోలీసులు తెలిపారు. నిమజ్జన ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు, ఫ్లడ్‌లైట్లు, క్రేన్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.

నిమజ్జనం సందర్భంగా డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని, బాణాసంచా కాల్చరాదని పోలీసులు స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఆల్కహాల్ మీటర్‌తో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిమజ్జన ప్రాంతాల్లో చిన్నపిల్లలను అనుమతించరాదని, మహిళల భద్రత కోసం షీ టీమ్స్ నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు.

ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యేక డైవర్షన్లు ఏర్పాటు చేశారు. భారీ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించనున్నారు. గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటిస్తూ నిర్దేశించిన మార్గాల్లోనే శోభాయాత్ర నిర్వహించాలని ఎస్పీ సూచించారు.

“జీరో యాక్సిడెంట్ – జీరో ఇన్సిడెంట్” లక్ష్యంతో నిమజ్జన కార్యక్రమానికి అన్ని భద్రతా చర్యలు చేపట్టామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

 

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.