నల్లగొండ: ఈరోజు జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు ఉంటాయని, అనంతరం పార్టీలకు అతీతంగా ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
సమస్యలను నా దృష్టికి తీసుకురండి.. పరిష్కరిస్తాం
డివిజన్లలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని తన దృష్టికి లేదా కార్పొరేషన్ సమావేశం దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరించేందుకు కృషి చేస్తామని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రధాన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.
కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపడుతున్నామని చెప్పారు. తాగునీటి సమస్యలు లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
తనకు ఏ డివిజన్‌పై వివక్ష లేదని, అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని మేయర్ స్పష్టం చేశారు. ప్రతిరోజూ ఒక వార్డును సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.


