నల్లగొండ, ఆగస్టు 26: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో మిలాద్ జూలూస్ కమిటీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు సల్మాన్ ఖాద్రి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ (అమేర్), వన్‌టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
దర్గా మెట్ల వద్ద ప్రారంభమైన ర్యాలీ గడియారం సెంటర్, ఆర్పీ రోడ్డు, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్, ఓల్డ్ సిటీ చౌరస్తా, గంజ్ బజార్ మీదుగా సాగి తిరిగి దర్గా మెట్ల వద్ద ముగిసింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రముఖ నాత్ గాయకులు పాదయాత్రగా పాల్గొని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమను చాటుతూ నాత్ పాటలు ఆలపించారు. వారి గానంతో పట్టణంలోని ప్రధాన వీధులు మార్మోగాయి.
భక్తులు స్వీట్లు పంచుకుంటూ ఉత్సాహంగా మిలాద్ వేడుకలను జరుపుకున్నారు. అనంతరం దర్గా మెట్ల వద్ద సుమారు 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ సందేశమైన ప్రేమ, శాంతి, సోదరభావాన్ని ప్రజల్లో చాటడమే మిలాద్ వేడుకల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
కార్యక్రమంలో మిలాద్ జూలూస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఆబేద్, అడ్వైజర్ ఎండి కలీమ్ ఖాన్ (జర్నలిస్ట్), మిలాద్ కమిటీ అధ్యక్షుడు మసి ఉద్దీన్ (అడ్వకేట్), కార్యదర్శి అబిద్, సీపీఎం సీనియర్ నాయకుడు హాశం, సలీం, పీస్ కమిటీ సభ్యులు, ఎంఐఎం సీనియర్ నాయకుడు ఖాజా గౌస్ మొహియుద్దీన్, విద్యార్థి సంఘం నాయకుడు కట్టెల శివ, బీఆర్ఎస్ నాయకుడు జమాల్ ఖాద్రి, సీపీఎం నాయకుడు దండంపళ్లి సత్తయ్య, కమిటీ సభ్యులు సుపియన్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు


