హైదరాబాద్: డీలిమిటేషన్ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వైఖరిపై తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచి 184కు తీసుకెళ్లే అవకాశం ఉందని, కాంగ్రెస్ 117 స్థానాల్లో విజయం సాధిస్తుందని రేవంత్‌రెడ్డి పదేపదే చెబుతున్నారని ఆయన అన్నారు.
గతంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలోనూ సీట్ల పెంపుపై రేవంత్ ప్రతిపాదనలు చేసినప్పటికీ, పార్టీ అధిష్ఠానం వాటిని పట్టించుకోలేదని విమర్శించారు. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని రాహుల్‌గాంధీ చెబుతుంటే.. రేవంత్‌రెడ్డి అందుకు భిన్నంగా మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయాలు ముందుగానే రేవంత్‌కు ఎలా తెలుస్తున్నాయని ప్రశ్నించారు.
ఢిల్లీ, విదేశీ పర్యటనలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తరచూ ఢిల్లీతో పాటు విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఇస్మాయిల్ విమర్శించారు. ఈ పర్యటనల ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, ఇప్పటివరకు గ్రౌండింగ్ అయిన ప్రాజెక్టుల వివరాలను ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ, విదేశీ పర్యటనలపై పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.
రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టాలి
రాష్ట్రంలో నిరుద్యోగం, ఉపాధి, సంక్షేమ పథకాల అమలు తదితర సమస్యలు పేరుకుపోయాయని ఇస్మాయిల్ అన్నారు. పరిపాలనలో సమన్వయం లోపించిందని విమర్శించారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీతో ఉన్న సాన్నిహిత్యాన్ని తెలంగాణ ప్రయోజనాల కోసం వినియోగించాలని రేవంత్‌రెడ్డికి సూచించారు.


