29 C
Hyderabad
Wednesday, September 16, 2026
Homeతెలంగాణస్వచ్ఛ వాయు సర్వేక్షణలో నల్గొండకు జాతీయ స్థాయి గుర్తింపు
Advertisement spot_img

స్వచ్ఛ వాయు సర్వేక్షణలో నల్గొండకు జాతీయ స్థాయి గుర్తింపు

Must read

కేటగిరీ–3లో జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్

రూ.20 లక్షల నగదు బహుమతితో అవార్డు

నల్లగొండ, సెప్టెంబర్ 7 (విజయ కెరటం):

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌కు జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP)లో భాగంగా నిర్వహించిన వార్డు స్థాయి స్వచ్ఛ వాయు సర్వేక్షణ–2026లో నల్గొండ సత్తా చాటింది.

దేశవ్యాప్తంగా 130 పట్టణ స్థానిక సంస్థలు పాల్గొన్న ఈ సర్వేక్షణలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ నంబర్–16 కేటగిరీ–3లో జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా రూ.20 లక్షల నగదు బహుమతితో కూడిన అవార్డును మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బి. వంశీకృష్ణ, 16వ వార్డు కార్పొరేటర్ పెరిక స్వాతి స్వీకరించారు.

సెప్టెంబర్ 7న న్యూఢిల్లీలోని ఇందిరా పర్యావరణ భవన్‌లోని గంగా ఆడిటోరియంలో నిర్వహించిన స్వచ్ఛ వాయు దివస్–2026 కార్యక్రమంలో అవార్డు ప్రదానం జరిగింది. కార్యక్రమానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్‌పర్సన్ జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ, ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ చైర్‌పర్సన్ రాజేష్ వర్మ, కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి తన్మయ్ కుమార్ తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

పలు అంశాలపై ప్రత్యేక దృష్టి

సర్వేక్షణలో గాలి నాణ్యత మెరుగుదల, రహదారి దుమ్ము నియంత్రణ, ఘన వ్యర్థాల నిర్వహణ, పచ్చదనం పెంపు, ప్రజల్లో అవగాహన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. నల్గొండ నగరంలో జంక్షన్ల అభివృద్ధి, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, బ్లాక్ ప్లాంటేషన్, ట్రాఫిక్ కారిడార్లలో పచ్చదనం పెంపు, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల రూపాంతరం, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ ప్లాంట్ వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

నంబర్–1 కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతాం: మేయర్

మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ జాతీయ స్థాయి అవార్డు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌కు గర్వకారణమన్నారు. నల్గొండ ఎమ్మెల్యే, రోడ్లు–భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహాయ సహకారాలతో నగర అభివృద్ధికి మరింత వేగం తీసుకువస్తామని తెలిపారు.

అన్ని డివిజన్లలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, ఆధునిక పట్టణ సౌకర్యాలు కల్పిస్తూ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను తెలంగాణలోనే నంబర్–1 కార్పొరేషన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

పరిశుభ్రమైన నల్గొండే లక్ష్యం: కమిషనర్

మున్సిపల్ కమిషనర్ బి. వంశీకృష్ణ మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహకారం, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మార్గదర్శకత్వంలో నగరానికి మెరుగైన మౌలిక వసతులు, ఆధునిక పౌర సౌకర్యాలు, పరిశుభ్రమైన పరిసరాలు, పచ్చదనం, సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను అందించేందుకు చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు.

స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన నల్గొండ నిర్మాణానికి మరింత సమన్వయంతో పనిచేస్తామని చెప్పారు.

కేటగిరీ–3లో జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్‌తో పాటు రూ.20 లక్షల నగదు బహుమతి లభించడం నల్గొండ నగర అభివృద్ధి ప్రస్థానంలో మరో కీలక మైలురాయిగా అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.