Sunday, November 1, 2026
Homeతెలంగాణక్లాక్ టవర్ సెంటర్‌కు మహర్దశ.. సుందరీకరణకు రూ.197.44 కోట్ల నిధులు

క్లాక్ టవర్ సెంటర్‌కు మహర్దశ.. సుందరీకరణకు రూ.197.44 కోట్ల నిధులు

📰 Generate e-Paper Clip

క్లాక్ టవర్ సెంటర్‌కు మహర్దశ.. సుందరీకరణకు రూ.197.44 కోట్ల నిధుల

షాపింగ్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్‌తో ఆధునిక హంగులు.. నమూనాను ఆవిష్కరించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు

నల్లగొండ, అక్టోబర్ 31 (విజయ కెరటం): నల్లగొండ నగర అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. నగరానికి ప్రత్యేక గుర్తింపుగా ఉన్న క్లాక్ టవర్ సెంటర్‌ను ఆధునిక హంగులతో సుందరీకరించేందుకు ప్రభుత్వం రూ.197.44 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో క్లాక్ టవర్ సెంటర్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు షాపింగ్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించినట్లు నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి తెలిపారు.

శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని తన చాంబర్‌లో డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమీర్, కార్పొరేటర్లతో కలిసి క్లాక్ టవర్ సెంటర్ సుందరీకరణ నమూనాను మేయర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు రూ.138.21 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.59.23 కోట్లు కలిపి మొత్తం రూ.197.44 కోట్లతో ఈ అభివృద్ధి పనులకు పరిపాలన ఆమోదం లభించిందని వెల్లడించారు.

క్లాక్ టవర్ సెంటర్‌లోని పాత ఆర్ అండ్ బి కార్యాలయ స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగర ప్రజలకు మెరుగైన షాపింగ్, వినోద సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు స్థానిక వ్యాపారాలకు ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. నగరానికి కొత్త ఆకర్షణ తీసుకురావడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు పెరిగేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందన్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో ఇప్పటికే నల్లగొండలో కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మేయర్ తెలిపారు. పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు, సాగర్ రోడ్డులో వైఎస్సార్ విగ్రహం నుంచి చర్లగౌరారం రోడ్డు వరకు ఆరు వరుసల రహదారి విస్తరణకు రూ.20 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. అలాగే రూ.100 కోట్లతో సయ్యద్ లతీఫుల్లా ఖాద్రి గుట్ట, బ్రహ్మంగారి గుట్టలకు ఘాట్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ అభివృద్ధి పనులతో నల్లగొండ నగరం పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత గుర్తింపు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

నల్లగొండ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ పనులను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మున్సిపల్ పాలకవర్గం, పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ, కార్పొరేటర్లు కేసాని వేణుగోపాల్ రెడ్డి, గుమ్ముల జానకి మోహన్ రెడ్డి, ఇబ్రహీం, ఆలకుంట్ల నాగరాజు, అబ్బగోని కవితా రమేష్ గౌడ్, బొజ్జ శంకర్, ఏదుళ్ల శ్రీధర్ రెడ్డి, ఇటికాల మంగమ్మ శ్రీనివాస్, పెరిక స్వాతి, ఆలకుంట్ల ఝాన్సీ, అల్లి సుభాష్ యాదవ్, రేగట్టే అండాలు, పున్న జ్ఞానేశ్వరి, పాలకూరి సుమలత, గోగుల గణేష్, వజ్జ సంతోషిని, గుండెబోయిన పుష్పలత తదితరులు పాల్గొన్నారు

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.