నల్గొండలో ఘనంగా గంధం ఉత్సవం.. గ్యార్మీ షరీఫ్ అన్నదాన
హిందూ–ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఖాజా ఖదర్ దర్గా ఉత్సవాలు
నల్గొండ, అక్టోబర్ 16 (విజయ కెరటం): నల్గొండ పట్టణంలోని ఓల్డ్ చౌరస్తాలో గల హజరత్ ఖాజా ఖదర్ మినుల్లా షా హుసేని దర్గా కమిటీ ఆధ్వర్యంలో గంధం ఉత్సవం, గ్యార్మీ షరీఫ్ అన్నదాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గురువారం సాయంత్రం గంధం ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించగా, శుక్రవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమాల్లో హిందూ, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్యార్మీ షరీఫ్ అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు, పేద ప్రజలు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మతసామరస్యం, సోదరభావం, సేవాభావానికి ఈ ఉత్సవాలు నిదర్శనంగా నిలిచాయి.
ఈ రెండు కార్యక్రమాలకు నల్గొండ 29వ వార్డు కార్పొరేటర్ నదీమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దర్గా కమిటీ అధ్యక్షుడు కరీం ఖాన్ (అబ్బు), ఉపాధ్యక్షుడు ఎం.డి. మజహార్ ఖాన్‌తో పాటు జై బాబు, ఆదిల్, రైస్, సల్మాన్, కైసర్, హమీద్, అలీ అన్సారీ, అమీర్ బేగ్, సమీర్, మున్నా, జానీ మియా, అఖిల్, మజీద్, రషీద్ తదితరులు పాల్గొని కార్యక్రమాల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
హజరత్ ఖాజా ఖదర్ దర్గా భక్తి, సేవ, మతసామరస్యానికి కేంద్రంగా నిలుస్తూ అన్ని వర్గాల ప్రజలను ఐక్యంగా ఉంచుతోందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.




