హన్మకొండ జిల్లాలో కారులో మహిళ మృతదేహం లభించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎల్కతుర్తి శివారులో కారు డిక్కీలో మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. కేసు దర్యాప్తులో భాగంగా వినోద్ కుమార్‌ను అరెస్ట్ చేసి విచారించారు.
మృతురాలిని గోదావరిఖనికి చెందిన మానస (33)గా గుర్తించారు. మానసకు గతంలో రెండు వివాహాలు జరిగి విడాకులు తీసుకున్నట్లు, ప్రస్తుతం ఎల్కతుర్తికి చెందిన వినోద్ కుమార్‌తో సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గతవారం అరుణాచలం వెళ్తున్నానని చెప్పి వినోద్ వద్దకు వచ్చిన మానస.. తనను పెళ్లి చేసుకోవాలని అతడిపై ఒత్తిడి చేసినట్లు సమాచారం. దీంతో వినోద్ మానస తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు.
అయితే, తన కుమార్తె కారణంగా కుటుంబ పరువు పోతుందని భావించిన ఆమె తండ్రి.. “ఆమెను చంపేయ్” అంటూ వినోద్‌కు చెప్పినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
ఈ క్రమంలో వినోద్ మానసను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని కారులో తరలించి పాతిపెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో భయపడిన వినోద్ మృతదేహాన్ని అక్కడే వదిలి పారిపోయినట్లు తెలుస్తోంది. ఎల్కతుర్తి శివారులో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


