కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్ఐ దువ్వల ఆంజనేయులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఓ కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇప్పించడంతో పాటు, చార్జ్‌షీట్ సమయంలో అనుకూలంగా వ్యవహరిస్తానంటూ రూ.30 వేల లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఎస్ఐ లంచం డిమాండ్‌తో విసిగిపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. అధికారుల పక్కా ప్రణాళికలో భాగంగా గురువారం ఎస్ఐ తన నివాసంలో బాధితుడి నుంచి రూ.30 వేల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం ఎస్ఐ ఆంజనేయులును అరెస్ట్ చేసి హైదరాబాద్ నాంపల్లిలోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచినట్లు అధికారులు వెల్లడించారు. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు తెలిపారు.
ప్రభుత్వ శాఖల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా ఏసీబీని ఆశ్రయించాలని అధికారులు సూచించారు. ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.


