ముస్లిం మహిళలు రాజకీయాల్లో మరింత చురుకుగా పాల్గొని అసెంబ్లీ, పార్లమెంట్‌లో అడుగుపెట్టాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపు స్వాగతించదగ్గ పరిణామమని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ అన్నారు.
ముస్లిం మహిళలు కేవలం ఓటర్లుగా కాకుండా ప్రజా సమస్యలపై పోరాడే నాయకులుగా, విధానాలను రూపొందించే ప్రజాప్రతినిధులుగా ఎదగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో ముస్లిం సమాజం గణనీయమైన జనాభా కలిగి ఉన్నప్పటికీ, రాజకీయ నిర్ణయాత్మక వేదికల్లో ముస్లిం మహిళలకు తగిన ప్రాతినిధ్యం లేదని సయ్యద్ ఇస్మాయిల్ అభిప్రాయపడ్డారు. విద్య, ఉపాధి, ఆరోగ్యం, భద్రత, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు చట్టసభల్లో వారి గొంతు వినిపించడం ద్వారా మరింత సమర్థవంతమైన పరిష్కారాలు సాధ్యమవుతాయని అన్నారు.
మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించడంతో పాటు యువతులను నాయకత్వం వైపు ప్రోత్సహించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉందని ఆయన తెలిపారు.
సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం లక్ష్యంగా కవితమ్మ ముందుకు తీసుకెళ్తున్న ఆలోచనలకు తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని సయ్యద్ ఇస్మాయిల్ అన్నారు. ముస్లిం మహిళలు రాజకీయాల్లోకి వచ్చి తమ హక్కుల కోసం, సమాజ అభివృద్ధి కోసం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.


