తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు త్వరలో స్మార్ట్ మీటర్లు అందుబాటులోకి రానున్నాయి. తొలుత కొత్త విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి, అనంతరం దశలవారీగా పాత కనెక్షన్లకు కూడా అమలు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రతి నెల 30 లేదా 31వ తేదీ అర్ధరాత్రి విద్యుత్ వినియోగాన్ని ఆటోమేటిక్‌గా నమోదు చేసి, ఆ వివరాల ఆధారంగా వినియోగదారులకు బిల్లులు పంపే విధానం అమలు చేయనున్నారు.
అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు తప్పనిసరిగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సాధారణ మీటర్లతో పోలిస్తే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు అధిక వ్యయం అవుతుండటంతో, ఆ ఖర్చును వినియోగదారుల నుంచి రాబట్టే అంశంపై డిస్కంలు ఆలోచిస్తున్నట్లు సమాచారం.


