విజయ కెరటం / తిప్పర్తి:
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని గంగన్నపాలెం గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురికి కత్తిపోట్లతో గాయాలు కాగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే, గంగన్నపాలెం గ్రామానికి చెందిన మర్రి నరేష్‌పై గతంలో 2025 వినాయక చవితి సందర్భంగా గంటెకంపు మధు, మేకల శివాజీ తదితరులు దాడి చేసిన కేసు తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో సెప్టెంబర్ 3, 2026న బోనాల పండుగ సందర్భంగా గ్రామంలోని పాత గ్రామపంచాయతీ వద్ద కొండేటి సతీష్, కొండేటి శ్రీకాంత్, మర్రి నరేష్ తదితరులు మాట్లాడుకుంటుండగా, ప్రత్యర్థి వర్గానికి చెందిన గంటెకంపు మధు, మేకల శివాజీ, కొండేటి ప్రసాద్, కొండేటి ప్రవీణ్ అక్కడికి చేరుకుని పాత గొడవలను కారణంగా తీసుకుని గొడవకు దిగారు.
ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో దుండగులు చేతులతో దాడి చేయడంతో పాటు కత్తులతో పొడవడంతో మర్రి నరేష్, కొండేటి సతీష్, కొండేటి శ్రీకాంత్ గాయపడ్డారు. గాయపడిన వారిని నల్లగొండలోని ఐకాన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై కొండేటి మహేందర్ ఫిర్యాదు మేరకు తిప్పర్తి ఎస్ఐ ఇరుగు రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.


