మణుగూరు డిపో కండక్టర్ ప్రవళిక మృతి పట్ల మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంత
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది – మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ, నవంబర్ 4 (విజయ కెరటం):
మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి పట్ల రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రవళిక పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద గత నెల 25న చిల్లర విషయంలో జరిగిన గొడవలో ప్రవళిక తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మృతి చెందారు. ఈ ఘటన పట్ల మంత్రి తన ప్రగాఢ విచారం వ్యక్తం
చేశారు.

