మరిపెడ సీఐ ఎల్. పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సై గండ్రాతి సతీష్ ఆధ్వర్యంలో పోలీసు బృందం పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో వేగంగా వస్తున్న బాలేనో కారును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్ పోలీసులను గమనించి తప్పించుకునేందుకు యత్నించడంతో వెంటనే వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో డ్రైవర్ సీటు కింద గంజాయి ప్యాకెట్‌తో పాటు కారులో మొత్తం 2.240 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది.
కారులో ప్రయాణిస్తున్న గండికోట వంశీ, చిత్రం రాకేష్, చింతల తిరుమలేష్, కంచి మహేష్, మాదాసు మహేష్లను అదుపులోకి తీసుకుని విచారించగా.. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో నల్గొండలో సెల్ఫ్ డ్రైవ్‌కు కారును అద్దెకు తీసుకుని ఒడిశాకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి, నల్గొండ జిల్లాలో విక్రయించేందుకు తరలిస్తున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి, బాలేనో కారు, నాలుగు సెల్‌ఫోన్లు, నగదును కోర్టులో సమర్పించేందుకు స్వాధీనంలోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.


