నల్గొండ, ఆగస్టు 12: ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. నల్గొండ కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో భూముల సమస్యలు, దాడుల కేసులు, ఉద్యోగాలు, ప్రమోషన్లలో రిజర్వేషన్ అమలు తదితర అంశాలపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించకుండా పూర్తిగా వారి అభివృద్ధికే వినియోగించాలని, రిజర్వేషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసులను వేగంగా పరిష్కరించి బాధితులకు పరిహారం అందించాలని, కోర్టు కేసుల్లో శిక్షల శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మిర్యాలగూడ డివిజన్లోని శూన్యపహాడ్–గణేష్‌పహాడ్ రోడ్డు సమస్యను త్వరగా పరిష్కరించాలని, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఔట్సోర్సింగ్ నియామకాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గుడితాండ పునరావాస కేంద్రంలో పరిహారం అందని వారికి న్యాయం చేయాలని, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాల నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు జిల్లాలో నిరంతరం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ద్వారా కేసులను సమీక్షిస్తూ, బాధితులకు పరిహారం అందేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
జిల్లాలో ప్రస్తుతం 54 ఎస్సీ, ఎస్టీ దాడుల కేసులు విచారణలో ఉన్నాయని, ఇప్పటివరకు 6 కేసుల్లో కోర్టుల ద్వారా శిక్షలు విధించబడినట్లు ఎస్పీ వెల్లడించారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు, జిల్లా అధికారులు, విజిలెన్స్ కమిటీ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


