- చిలకలూరిపేటకు చెందిన ఓ B.Tech విద్యార్థిని మృతదేహం కారంపూడి మండలం చింతపల్లి గ్రామ శివారులోని పొలాల్లో లభ్యమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. చిలకలూరిపేటకు చెందిన షేక్ హసీనా (23) మిట్టపల్లి ప్రాంతంలోని ఓ కళాశాలలో B.Tech చదువుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పటిలాగే కళాశాలకు వెళ్లిన యువతి ఆ తర్వాత ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
రెండు రోజులుగా యువతి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. యువతికి పరిచయం ఉన్న ఓ యువకుడిని విచారించినట్లు తెలుస్తోంది.
విచారణలో లభించిన సమాచారంతో కారంపూడి మండలం చింతపల్లి గ్రామ శివారులోని పొలాల్లో పోలీసులు గాలింపు చేపట్టగా.. యువతి మృతదేహాన్ని గుర్తించినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు అక్కడ ఆధారాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఘటనాస్థలిలోకి మీడియా ప్రతినిధులను పోలీసులు అనుమతించలేదని సమాచారం.
యువతి మృతికి అసలు కారణం ఏమిటి? ఆమె అక్కడికి ఎలా చేరుకుంది? ఈ ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోలీసుల దర్యాప్తు పూర్తయి, అధికారికంగా వివరాలు వెల్లడించిన తర్వాతే యువతి మృతికి గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


