కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎరుకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసిం
ఎరుకల సమాజ అభ్యున్నతికి పలు కీలక అంశాలపై చర్చ
నిజాంపేట్‌లో ఏకలవ్య భవనం, ఎమ్మెల్సీ అవకాశం, పిగ్ ఫామ్స్ అభివృద్ధి, నాంచారమ్మ జాతరకు గుర్తింపు కల్పించాలని విజ్ఞప్తి
హైదరాబాద్ నవంబర్ 17 విజయ కెరటం ప్రతినిధి: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కోనేటి నరసింహ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటాన్ని, ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన నాయకత్వాన్ని కోనేటి నరసింహ కొనియాడారు. అనంతరం సుమారు గంటా 10 నిమిషాల పాటు ఎరుకల సమాజ అభ్యున్నతికి సంబంధించిన పలు అంశాలపై కేసీఆర్‌తో చర్చించారు.
నిజాంపేట్‌లో ఎరుకల జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఏకలవ్య భవనం నిర్మించాలని, రాజకీయంగా వెనుకబడిన ఎరుకల సమాజానికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. అలాగే సంప్రదాయ జీవనోపాధిలో భాగమైన పందుల పెంపకాన్ని ఆధునిక పద్ధతుల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఎరుకల ఆరాధ్య దైవమైన శ్రీశ్రీశ్రీ నాంచారమ్మ జాతర అభివృద్ధి, ప్రభుత్వ గుర్తింపు, మౌలిక సదుపాయాల కల్పనపై కూడా చర్చించారు. భువనగిరి-యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి గ్రామానికి చెందిన ఎరుకల నాంచారమ్మ చారిత్రక విశిష్టతను కేసీఆర్‌కు వివరించారు. దీనిపై స్పందించిన కేసీఆర్, గతంలో తన ప్రభుత్వం ఎరుకల నాంచారమ్మను గుర్తించిన విషయాన్ని గుర్తుచేశారు. రామప్ప దేవాలయం సమీపంలోని రామానుజపురం వద్ద నిర్వహించే జాతరకు రాష్ట్రవ్యాప్తంగా ఎరుకల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారని నరసింహ వివరించారు.
ఎరుకల సమాజానికి విద్య, ఉపాధి, ఆర్థిక అభివృద్ధి, సాంస్కృతిక గుర్తింపుతో పాటు రాజకీయ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని కోనేటి నరసింహ తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, ప్రజల ఆత్మగౌరవానికి కేసీఆర్ నాయకత్వం ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉండ్రాతి రవి (టీఏవైఎస్ ఎల్బీనగర్ అధ్యక్షుడు), బీఆర్ఎస్ నాయకుడు పల్లంకొండ సుధాకర్, ఎరుకల యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

