Tuesday, November 24, 2026
Homeరాజకీయంపట్టభద్రుల గళంగా.. బీసీ బిడ్డల స్వరంగా నిలుస్తా

పట్టభద్రుల గళంగా.. బీసీ బిడ్డల స్వరంగా నిలుస్తా

📰 Generate e-Paper Clip

పట్టభద్రుల గళంగా.. బీసీ బిడ్డల స్వరంగా నిలుస్త

నిరుద్యోగ యువత ఆశయ సాధనకు కృషి చేస్తా

బహుజన బిడ్డను గెలిపించి ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చాలి

ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 16 (విజయ కెరటం): పట్టభద్రుల సమస్యల పరిష్కారంతో పాటు నిరుద్యోగ యువత ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తానని తెలంగాణ రక్షణ సేన వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ అన్నారు. బహుజన బిడ్డగా, తెలంగాణ ఉద్యమంలో పోరాడిన విద్యార్థి నాయకుడిగా తనకు అవకాశం కల్పించి ఆశీర్వదించాలని పట్టభద్రులను కోరారు.

కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసి పీహెచ్‌డీ సాధించిన తాను పేదరికం నుంచి వచ్చానని, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు తనకు తెలుసని పేర్కొన్నారు. గతంలో హామీలు ఇచ్చి గెలిచిన నాయకులు పాలక పక్షాలకు అనుకూలంగా మారి పట్టభద్రులు, ఉద్యమకారుల సమస్యలను విస్మరించారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.

తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీసీ బిడ్డకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించడం అభినందనీయమని ఎన్నికల ఇన్‌చార్జి ఇస్మాయిల్ అన్నారు. బహుజన అభ్యర్థిని గెలిపించి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించి రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాల హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం వల్ల యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని అన్నారు.

ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల భూ సమస్యపై విశారదన్ మహారాజ్‌తో కలిసి మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టి సుమారు 400 కుటుంబాలకు ఇంటి పట్టాలు ఇప్పించేందుకు కృషి చేశామని గుర్తుచేశారు. రోహిత్ వేముల చట్టం కోసం కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చామని తెలిపారు.

కొత్తగూడెం ప్రాంతానికి జీవనాధారమైన సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించే ప్రయత్నాలు స్థానిక యువత భవిష్యత్తుకు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. డిగ్రీలు చదివిన పట్టభద్రులు సైతం కోల్‌బెల్ట్ ప్రాంతంలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పోడు భూముల కోసం పోరాడుతున్న యువతకు న్యాయం జరగడం లేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు.

పట్టభద్రులు తనకు అవకాశం కల్పిస్తే వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉంటానని, ప్రజల మధ్య ఉంటూ సేవ చేస్తానని డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.