నకిలీ మరణ ధ్రువీకరణ పత్రంతో కారుణ్య ఉద్యోగం.. 14 మంది అరెస్ట్
రూ.13 లక్షలకు ఒప్పందం.. రూ.5 లక్షల నగదు, కంప్యూటర్, ప్రింటర్, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం
నల్లగొండ, నవంబర్ 08 (విజయ కెరటం):
ప్రభుత్వ ఉద్యోగి విధుల్లో ఉండగానే మరణించినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి, ఆయన కుమారుడికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించిన భారీ మోసాన్ని నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ అక్రమ వ్యవహారంలో కుటుంబ సభ్యులు, బంధువులు, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది సహా మొత్తం 14 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ వెల్లడించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
రూ.13 లక్షలకు ఒప్పందం.. పక్కా ప్రణాళికతో మోసం
నకిరేకల్ మండలం ఒగోడు గ్రామానికి చెందిన చామకూరి వెంకటేశ్వర్లు శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ 2025 మే 31న పదవీ విరమణ పొందారు. అనారోగ్యంతో అదే ఏడాది నవంబర్ 17న మరణించారు. అయితే ఆయన ఉద్యోగంలో ఉండగానే మరణించినట్లు తప్పుడు రికార్డులు సృష్టిస్తే కుమారుడికి కారుణ్య నియామకం లభిస్తుందని కుటుంబ సభ్యులు, బంధువులు, కొందరు ఉద్యోగులు కలిసి కుట్ర పన్నారు. ఈ వ్యవహారంలో మృతుడి భార్యతో రూ.13 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఆధార్ చిరునామా మార్పు.. నకిలీ ధ్రువీకరణ పత్రం
కుట్రలో భాగంగా మృతుడి ఆధార్ కార్డులో చిరునామాను నల్లగొండ పట్టణంలోని చైతన్యపురి కాలనీకి మార్చి, ఆయన 2025 మే 28న మరణించినట్లు నల్లగొండ మున్సిపాలిటీ నుంచి నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం పొందారు. ఇందుకు మీ సేవా కేంద్ర నిర్వాహకుడు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది సహకరించినట్లు దర్యాప్తులో గుర్తించారు. అనంతరం ఈ నకిలీ పత్రాన్ని ఆధారంగా చేసుకుని వైద్య ఆరోగ్య శాఖలో తప్పుడు విచారణ నివేదికలు రూపొందించి, మృతుడి కుమారుడు చామకూరి రాజుకు దామరచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించారు.
వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పాత్రపై విచారణ
ఈ వ్యవహారంలో శాలిగౌరారం పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్‌తో పాటు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది తప్పుడు పత్రాల తయారీ, విచారణ నివేదికల రూపకల్పనలో సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. మున్సిపల్ శాఖలో వార్డు ఆఫీసర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌తో పాటు వైద్య ఆరోగ్య శాఖలోని ఉద్యోగుల పాత్రను కూడా దర్యాప్తులో వెలుగులోకి తీసుకొచ్చారు.
రూ.5 లక్షల నగదు సహా సామగ్రి స్వాధీనం
నల్లగొండ మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు నవంబర్ 4న వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ కె. శివరామిరెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించాయి. ఈ కేసులో రూ.5 లక్షల నగదు, ఒక కంప్యూటర్, ఒక ప్రింటర్, 12 సెల్‌ఫోన్లు, మృతుడి ఫొటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల కోసం నకిలీ పత్రాలు సృష్టించి మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గమనిక: పోలీసుల ప్రకటన ప్రకారం 14 మంది అరెస్టు కాగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కే
సు దర్యాప్తు కొనసాగుతోంది.

