29 C
Hyderabad
Wednesday, September 16, 2026
Homeతెలంగాణనల్గొండనల్లగొండ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌
Advertisement spot_img

నల్లగొండ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌

Must read

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీలో నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె. రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఈ నెల 11న తన ఇంట్లోనే ఆమె దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో పూర్వ, ప్రస్తుత విద్యార్థులు ముగ్గురు నిందితులుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. రూపారెడ్డి ఇంట్లో ఒంటిపై కత్తిపోట్లతో మృతదేహం కనిపించింది. 

హత్యకు పాల్పడిన సమయంలో నిందితులు గ్లౌజులు ధరించినట్లు పోలీసులు అనుమానించారు. దీంతో ఘటనా స్థలంలో పెద్దగా ఆధారాలు లభించకపోవడంతో కేసు దర్యాప్తు సవాలుగా మారింది. తొలుత సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడి వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. పాఠశాల సిబ్బంది, కుటుంబ సభ్యులు, కాలనీ వాసులతో పాటు పలువురిని విచారించారు. 

సుమారు 80 మందిని ప్రశ్నించిన అనంతరం పోలీసులు కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు ప్రత్యేక నిఘా విభాగం పోలీసులు కూడా రంగంలోకి దిగి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కొండమల్లేపల్లి మండలంలోని రెండు తండాలకు చెందిన విద్యార్థులపై పోలీసులకు అనుమానం వచ్చినట్లు సమాచారం.

రూపారెడ్డి హత్య అనంతరం ఇంటి నుంచి సుమారు రూ.4 లక్షల నగదును నిందితులు చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు అసలు కారణం ఏమిటి..? నగదు కోసమే ఈ దారుణానికి పాల్పడ్డారా..? లేక మరేదైనా కారణం ఉందా..? అనే విషయాలపై దర్యాప్తు కొనసాగుతోంది. 

ముగ్గురు అనుమానితులను మంగళవారం ఇబ్రహీంపట్నం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను బుధవారం సాయంత్రంలోగా వెల్లడించే అవకాశం ఉందని పోలీసులు తెలిపినట్లు సమాచారం.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.