పల్నాడు జిల్లా, రెంటచింతల: పల్నాడు జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకుడు నవులూరి చెన్నారెడ్డి హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది.
రోజూలాగే పనుల నిమిత్తం పట్టణానికి వెళ్లిన చెన్నారెడ్డి, తిరిగి ఇంటికి వస్తుండగా రెంటచింతల–రెంటాల రహదారిపై గుర్తుతెలియని దుండగులు ఆయనపై ప్రాణాంతక దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
హత్యకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


